అమరావతి : గత నెల ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రావడంతో, గడిచిన రెండ్రోజుల నుంచి గ్రామాల్లో చేనేతలకు విద్యుత్ బిల్లులను ట్రాన్స్ కో అధికారులు అందజేస్తూ వస్తున్నారు. జీరో పేమెంట్ విద్యుత్ బిల్లులు రావడంతో, చేనేతల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ట్రాన్స్ అధికారులు చెబుతుండడంతో వారంతా మురిసి పోతున్నారు. చేనేత, విద్యుత్ శాఖాధికారులు సమన్వయంతో పనిచేస్తూ నేతన్నల ఉచిత విద్యుత్ పథకం విజయవంతానికి తమ వంతు పాత్ర పోషించారు. రాష్ట్రంలో 50,252 మగ్గం నేతన్నల కుటుంబాలను, 6,995 మరమగ్గం మీద నేసే కుటుంబాలను ఉచిత విద్యుత్ పథకం కింద అర్హులుగా గుర్తించారు. వారికి ఉచిత విద్యుత్ సరాఫరా చేశారు. మిగిలిన అర్హులకూ ఉచిత విద్యుత్ పథకం వర్తించేలా కృషి చేస్తున్నారు.
ఉచిత విద్యుత్ తో మగ్గం నేతన్నలకు నెలకు రూ.720లు, సంవత్సరానికి రూ.8,640లు లబ్ధి కలుగనుంది. మరమగ్గం మీద నేసే కుటుంబానికి నెలకు రూ.1,800లు, ఏడాదికి రూ.21,600లు లబ్ధి కలుగనుంది. ఉచిత విద్యుత్ రూపంలో నెల నెలా ఆర్థిక భారం తప్పిందని, తమకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తోందని నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చినమాటకు కట్టుబడుతూ, ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు, కూటమి ప్రభుత్వానికి చేనేతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చేనేత కార్మికులకు గౌరవ జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సగం ధరకే చీర, దోవతి నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ చేనేత రంగానికి ఊపిరిపోస్తే, నేడు సీఎం చంద్రబాబు నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేసేలా పథకాలు రూపొందిస్తున్నారు.















