అమరావతి : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శాఖా మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రవాణా సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర కూటమి సర్కార్ పర్యవేక్షిస్తోందని, పరిస్థితులను గమనిస్తోందన్నారు. ప్రజా సంక్షేమం కోసం తమ సర్కార్ కట్టుబడి ఉందన్నారు.
పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సులు, ఇతర రవాణా సేవలు నిరంతరంగా కొనసాగించాలని అన్నారు. అంతే కాకుండా రవాణా సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. ప్రజలు కూడా ఆందోళన చెందకుండా సహకరించాలని కోరారు.
కాగా ప్రస్తుతం పశ్చిమాశియాలో చోటు చేసుకున్న యుద్దం కారణంగా తీవ్ర ఇబ్బంది ఏర్పడింది పెట్రోల్ ,డీజిల్ . దీంతో ప్రజలు , వినియోగదారులు తమకు అందదేమోనన్న ఆందోళనతో పెద్ద ఎత్తున ఆయా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు మంత్రి.

















