అమరావతి : ఏపీని ఎండలు ముంచెత్తాయి. జనం వేడిమి తట్టుకోలేక లబోదిబోమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో ఈ రోజు తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలతో సహా మొత్తం 14 మండలాలపై తీవ్ర వడగాలుల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి,, ఏలూరు జిల్లాల్లోని 28 మండలాల్లో వడగాలి పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో ఈ రోజు తీవ్ర వడగాలులు, వడగాలి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ .
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జైన్ పేర్కొన్నారు; ఈ నేపథ్యంలో వడగాలులు, తీవ్రమైన వేడి, అధిక తేమ నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా, శుక్రవారం రాష్ట్రంలోని 22 జిల్లాల పరిధిలో ఉన్న 207 మండలాల్లో 41 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు జైన్ తెలిపారు. నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో మన్యం జిల్లాలోని సాలూరులో 45.2 డిగ్రీలు, కర్నూలు జిల్లాలోని నందికొండలో 43.7 డిగ్రీలు, నంద్యాల జిల్లాలోని గోస్పాడులో 43.6 డిగ్రీలు , అనంతపురం జిల్లాలోని తెరణ్ణపల్లిలో 43.5 డిగ్రీలు ఉన్నాయని తెలిపారు.


















