అనకాపల్లి జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 23న గురువారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం (జెడ్.చింతువ పంచాయతీ) వద్ద జరగనున్న ‘రెన్యూ ఫొటోవోల్టాయిక్స్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకొని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి క్షేత్రస్థాయిలో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా లతో కలిసి ఐజీ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, సభా ప్రాంగణం, కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు జరగకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని ఐజీ ఆదేశించారు. విధుల్లో ఉండే ప్రతి అధికారి, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిశిత దృష్టి సారించాలని సూచించారు.ట్రాఫిక్ నియంత్రణ: ముఖ్యమంత్రి బందోబస్తు, విధులకు ఆటంకం కలగకుండా, అదే సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలని స్పష్టం చేశారు.
ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను దిగ్విజయం చేయాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, బి.హేమంత్ , ఏఎస్పీ చింతూరు, ఆర్డీవో వీవీ రమణ, ఎస్.బి డీఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్, పరవాడ ఇన్చార్జి డీఎస్పీ బి.మోహన రావు, రాంబిల్లి ఇన్స్పెక్టర్ నర్సింగరావు పాల్గొన్నారు.
















