గోవా : ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మర్యాద పూర్వకంగా గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఇద్దరూ ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. తామిద్దరి మధ్య కొన్నేళ్ల అనుబంధం ఉందన్నారు. ఇది విడదీయలని సోదర సమానమైన అనుబంధం అని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం తనదని కొనియాడారు స్పీకర్. కుటుంబ సభ్యులతో కలిసి అశోక్ గజపతిరాజును కలవడం ఆనందంగా ఉందన్నారు.
ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్లపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల రాజకీయ ప్రవేశాన్ని ఎన్టీఆర్ ఆనాడే గుర్తించారని ప్రశంసించారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లుల విషయంలో రాజకీయాలు చేయడం తగదు అని అన్నారు. ఇందిరా గాంధీ వంటి వారు మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారని ప్రశంసించారు. మహిళా సాధికారతకు రాజకీయ రిజర్వేషన్లే మార్గం తప్ప మరోటి కాదన్నారు.

















