అమరావతి : మహానాడు-2026లో తీసుకున్న అత్యంత విప్లవాత్మక నిర్ణయాల్లో మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ ఒకటని టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ఎన్టీఆర్ పునాది వేయగా, చంద్రబాబు ఆర్థిక స్వావలంబన కల్పించారని, ఇప్పుడు నారా లోకేష్ మహిళలను నేరుగా రాజకీయ నిర్ణయాధికార కేంద్రంలోకి తీసుకువచ్చే చారిత్రాత్మక నిర్ణయం ప్రతిపాదించారని అన్నారు. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ల గురించి చర్చలు జరిగినా… ఒక రాజకీయ పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో, ఎన్నికల రాజకీయాల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించడం గొప్ప సంస్కరణ అని పేర్కొన్నారు. ఇది కేవలం రిజర్వేషన్ కాదని… మహిళలకు రాజకీయ అధికారం పంచిపెట్టే నిర్ణయమని అభివర్ణించారు.
మహానాడు వేదికగా 21 కీలక తీర్మానాలు ఆమోదించామని, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం నుంచి మహిళా సాధికారత, యువత ఉపాధి, బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సాంకేతిక అభివృద్ధి వరకు అన్ని అంశాలపై విస్తృత చర్చ జరిగిందని తెలిపారు. 88 మంది నాయకులు, కార్యకర్తలు వివిధ తీర్మానాలపై ప్రసంగించడం మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు మహానాడు విజయంతో ప్రయాణం ముగియ లేదని, ఇక్కడ తీసుకున్న తీర్మానాలు, ప్రభుత్వ విజయాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మహానాడు-2026ను ఘన విజయవంతం చేసిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, నాయకులు, కార్యకర్తలు, సాంకేతిక బృందాలు, ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పల్లా శ్రీనివాసరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
