కష్టపడిన కార్యకర్తను పార్టీ విస్మరించదు

స్ప‌ష్టం చేసిన మంత్రి ఎస్. స‌విత

hellotelugu-SSavitha

శ్రీ స‌త్య సాయి జిల్లా : టీడీపీకి పార్టీ కార్యకర్తలే వెన్నుముక అని, పార్టీ అభ్యున్నతి కోసం కష్టించి పనిచేసిన వారిని అధిష్టానం ఎప్పుడూ విస్మరించబోదని మంత్రి సవిత స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారందరికీ పదవులు తప్పనిసరిగా వరిస్తాయన్నారు. పీక మీద కత్తి పెట్టి బెదిరించినా భయపడకుండా జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య మనకు స్ఫూర్తి అని అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతోందన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా, నాయకుడిపైనా ఉందని మంత్రి సవిత స్పష్టం చేశారు.

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమైందని మంత్రి సవిత మండిపడ్డారు. చివరికి ఏపీకి రాజధాని కూడా లేకుండా పోయిందన్నారు. మరోసారి సీఎం చంద్రబాబు అధికారంలోకి రావడంతో, రాజధాని అమరావతి పనులు ఊపందుకున్నాయన్నారు. రాజధానిని భవిష్యత్తులో మరెవరూ కదపకుండా ఉండేలా అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపామన్నారు. కూటమి నాయకులను టీడీపీ శ్రేణులు కలుపుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కూటమి ప్రభుత్వాలే అధికారంలోకి మళ్లీ మళ్లీ రావాలన్నారు. కష్టకాలంలో సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా నిలిచారన్నారు. ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా ప్రధాని నరేంద్ర మోడి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి సవిత తెలిపారు.

Exit mobile version