తెలంగాణ‌పై ప‌వ‌న్ కామెంట్స్ దారుణం : ష‌ర్మిల‌

వెంట‌నే ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల్సిందే

hellotelugu-YSSharmila

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏకి పారేశారు. బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక బాధ్య‌త క‌లిగిన ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న త‌ను ఇలాంటి విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా, ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టేలా , ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ కామెంట్స్ చేయ‌డం ముమ్మాటికీ త‌ప్పేన‌న్నారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం త‌ను మాట్లాడాడో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. పూర్తిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం అన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ష‌ర్మిలా రెడ్డి.

అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దని సూచించారు. శంకరగుప్తం డ్రెయిన్ కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపోతే సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదన్నారు. ఇది కూట‌మి స‌ర్కార్ చేత‌కానిత‌నానికి అద్దం ప‌డుతుంద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి. మూఢ‌ నమ్మకాలను అడ్డంపెట్టుకుని ప్రజలను కించ ప‌ర్చ‌డం త‌న స్థాయిని త‌గ్గించేలా చేస్తుంద‌న్నారు. రాజ‌కీయ నాయ‌కుడికి సంయ‌మ‌నం, ముందుచూపు, ప్ర‌జ‌ల ప‌ట్ల అనుర‌క్తి ఉండాల‌న్నారు ఏపీపీసీసీ చీఫ్‌. త‌క్ష‌ణ‌మే మీకు చిత్త‌శుద్ది ఉంటే కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపాల‌ని డిమాండ్ చేశారు.

Exit mobile version