YS Jagan : తాడేపల్లి గూడెం : ఏపీ కూటమి సర్కార్ అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan). వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రధాన సమస్యలు, అంశాలపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో తిరోగమనం కొనసాగుతోందన్నారు. ప్రజలకు కనీసంగా చేయాల్సినవి కూడా చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ మోహన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తన వ్యక్తిగత ప్రచారంపై ఎక్కువగా దృష్టి సారించారని ఆరోపించారు. ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న రాచరిక పాలనకు వ్యతిరేకంగా వైసీపీ ఒక్కటే గొంతు వినిపిస్తోందని చెప్పారు.
YS Jagan Slams CM Chandrababu
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన సభలో, శాసన మండలిలలో గట్టిగా వినిపించాలని దిశా నిర్దేశం చేశారు జగన్ మోహన్ రెడ్డి. తాము తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రజలకు చెందిన తరతరాల ఆస్తి అని అన్నారు. తన అత్తగారి సొమ్ము అన్నట్టు చంద్రబాబు అన్నింటిని అమ్మేసే పనిలో ఉన్నాడని ఆరోపించారు. దీన్ని కచ్చితంగా అడ్డుకోవాలి, ప్రజలతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు పొడిస్తే సహించేది లేదన్నారు. తాము మాట్లాడేలా తగిన సమయం కేటాయించడం ఇష్టం లేకనే, వైయస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైయస్ జగన్ స్పష్టం చేశారు. మొత్తం సభ్యులతో కలిపి, కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే ఇచ్చే అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు అవసరమైన పూర్తి మెటేరియల్ సిద్ధంగా ఉందని, కానీ మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదు కాబట్టే.. సభకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు.
Also Read : TTD- SP Subbarayudu Interesting Update : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత

















