అమరావతి : ప్రతి ఒక్కరు పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చు కోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. బాలసుబ్రమణ్యం. శక్తి సామర్థ్యంలో జాతీయ స్థాయిలో ఏపీ ఆదర్శంగా నిలవనుందని పేర్కొన్నారు. ప్రధానంగా మిషన్ లైఫ్ ను ప్రజా ఉద్యమంగా మార్చడంలోనూ, పర్యావరణ హిత జీవనశైలిని ప్రోత్సహించడంలోనూ యువత కీలక పాత్ర పోషించాలని సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు , విద్యుత్ పంపిణీ సంస్థలు ), గృహ నిర్మాణం, పట్టణ-గ్రామీణ అభివృద్ధి, అంగన్‌వాడీలు, పర్యాటకం , ప్రజా మౌలిక సదుపాయాల వంటి రంగాలను కలుపుకుని, అత్యంత సమగ్రమైన శక్తి సామర్థ్య భాగస్వామ్య విధానాన్ని ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తోందని చెప్పారు.
తద్వారా “సుస్థిర అభివృద్ధి , వాతావరణ పరిరక్షణ చర్యలలో జాతీయ ప్రమాణంగా నిలిచే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు సీఎస్. రాష్ట్రం అనుసరిస్తున్న ‘సంపూర్ణ అమలు వ్యూహంస ద్వారా ఏటా వందల కోట్ల రూపాయల ఆదా జరగడంతో పాటు, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ‘మిషన్ లైఫ్’పై రూపొందించిన నివేదికను సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. అలాగే, పర్యావరణ హితమైన, సుస్థిర భవిష్యత్తును ప్రోత్సహించే లక్ష్యంతో ఆచరించదగిన 75 జీవనశైలి మార్పులను వివరించారు. ఈఈఎస్ఎల్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విస్తృత సహకారం, శక్తి సామర్థ్య ప్రాజెక్టులు , ‘మిషన్ లైఫ్’ (పర్యావరణం కోసం జీవనశైలి) అమలులో ఒక మైలురాయి వంటి నమూనాగా నిలుస్తుందని, తద్వారా భారతదేశ వాతావరణ లక్ష్యాల సాధనకు దోహద పడుతుందని ఆయన అన్నారు.
















