అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ కూటమి సర్కార్ నిర్వాకంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవస్థలను నీరు గార్చి ప్రజలను నిట్ట నిలువునా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం తప్పా చేసింది ఏముందంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారని ఆరోపించచారు జగన్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడం లేదన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులు వేస్తుంటే , వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలిపితే, కనీసం మీకు చీమ కుట్టినట్టైనా లేదంటూ మండిపడ్డారు. అనేక ప్రాంతాలు సాగు నీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నాసరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే, రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బ తీస్తుంటే ఎలా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేక పోతే మీకెందుకు ఆ పదవి? ఉన్నా లేనట్టేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ మోహన్ రెడ్డి. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు, స్పిల్‌వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే అప్పట్లో చూసీ చూడనట్లుగా వ్యవహరించారంటూ ఫైర్ అయ్యారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీ ఎంపీల బలం మీదే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా, 1995-2004వరకూ కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా మీకు మీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు.
మీకున్న రాజకీయ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడలేదన్నది నిజమే కదా? సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితం అయినా, చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్‌వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేసిందనేది వాస్తవం కాదా అని సీరియస్ అయ్యారు.
