న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్ నైపుణ్యాలు కలిగగిన యువ శక్తి రాష్ట్రానికి అతి పెద్ద వనరుగా మారబోతోందని అన్నారు. న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఏపీని నాలెడ్జి హబ్ గా మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలో క్వాంటం కంప్యూటింగ్, డేటా సెంటర్లు, డ్రోన్, స్పేస్ సిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి వివరించారు. రియల్ టైమ్ గవర్నెన్స్, పర్సనలైజ్డ్ మెడిసిన్ వంటి అంశాలపై భవిష్యత్ కార్యాచరణను సీఎం ప్రస్తావించారు. వచ్చే 25 ఏళ్లపాటు దేశానికి, రాష్ట్రానికి అతిపెద్ద వనరుగా యువశక్తి మారనుందని సీఎం వివరించారు.
క్రియేటర్ ఎకానమీని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి సహకారం అందించాలని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. విద్యార్ధులు, నిపుణులకు మరింత నైపుణ్యాలను అందించేలా ప్రత్యేకంగా క్రియేటర్ సాఫ్ట్ వేర్ ను అందించనున్నట్టు అడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్ తెలిపారు. ఏఐ లివింగ్ ల్యాబ్స్ తో పాటు పౌరసేవల డిజిటలైజేషన్ అంశంపై కూడా ఇరువురి మధ్యా లోతైన చర్చ జరిగింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం ఎన్విడియా సంస్థ సహకారం అందించాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాలిస్టారెడ్మెండ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆ సంస్థ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు నైపుణ్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
