అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. కోనసీమ జిల్లా జరిగిన మీ భూమి- మీ హక్కు సభలో వివిధ అంశాలను కూలంకుషంగా వివరించారు. విభజన నష్టాలు… గత ప్రభుత్వ విధ్వంస గాయాలు, కూటమి చేస్తున్న అభివృద్ధి, గొడ్డలి పార్టీ కుట్రలు వంటి వాటిని ప్రస్తావించారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని కోరారు. 2019-24 లో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం ఏపీకి జరిగిందని ఆవేదన చెందారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ను కక్షతో గోదాట్లో కలిపేశారని సంచలన ఆరోపణలు చేశారు . రాజకీయ కక్షతో కాంట్రాక్టర్ ను మార్చకుండా ఉంటే 2021కే పోలవరం ప్రాజెక్టు పూర్తై ఉండేదన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కరవు పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు ఏపీని ఆదుకుని ఉండేదన్నారు . గత పాలనలో బయటకు రావాలంటే భయం, మాట్లాడాలంటే భయం. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల పేపర్లను ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లతో దిద్దించి అవకతవకలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తాము వచ్చాక పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు సీఎం.
వైసీపీ ఐదేళ్ల పాలనలో నాసిరకం మధ్యంతో ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారంటూ ధ్వజమెత్తారు.
30 వేల మంది కల్తీ మద్యం కారణంగా చనిపోయారు. ఆరోగ్యాలు పోగోట్టుకున్నారంటూ వాపోయారు.
వైసీపీ ప్రజల జీవితాలతో ఆడుకుంది. 2024లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కూటమికి మద్దతు ఇచ్చారు.
అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల్ని చర్చించమంటే అసెంబ్లీకి వచ్చేదే లేదని గొడ్డలి పార్టీ నేతలు మొండికేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బయటకు వస్తే చాలు ఎక్కడికి వెళ్లినా హింసేనని అన్నారు. రాజకీయ పార్టీగా ఎలాంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నారని ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు. సామాజిక మాధ్యమాల్లో మా కుటుంబాల గురించి అసభ్యంగా రాయిస్తున్నారని, కానీ చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
నేను గతంలో నక్సల్స్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాను. అలిపిరిలో నాపై క్లైమోర్ మైన్స్ పేల్చినా నేను ప్రజల కోసమే పని చేస్తున్నానని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో ఎప్పుడూ కఠినంగానే ఉంటాననని హెచ్చరించారు. ముఠా కక్షల విషయంలో మాట వినని మా పార్టీ ఎమ్మెల్యేలను ఇద్దర్ని అరెస్టు చేసిన చరిత్ర నాదన్నారు. సీఎంగా నేను సమర్ధవంతంగా పనిచేయకపోతే రాష్ట్రానికి నష్టం కలుగుతుందన్నారు.
