న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా భారత జట్టు పేలవమైన ఆట తీరు పట్ల స్పందించాడు. ప్రధానంగా హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ పై నిప్పులు చెరిగారు. ఐపీఎల్ ను ఆధారంగా చేసుకుని ప్లేయర్లను ఎంపిక చేస్తూ పోతే చివరకు ఇలాంటి ఫలితాలే వస్తాయని పేర్కొన్నాడు. ప్రధానంగా ఐపీఎల్ ల్యాబ్ ఆధారంంగా మ్యాచ్ విన్నర్లను తయారు చేయలేమని, ఆ విషయాన్ని గౌతమ్ గంభీర్ గుర్తించాలని సూచించాడు. ఇకనైనా హెడ్ కోచ్ తన పనితీరు మార్చు కోవాలని లేక పోతే జట్టులో కేవలం కొందరే ఆడేవాళ్లు ఉంటారన్నాడు.
టీమిండియా ప్రస్తుతం ఉన్న లైనప్ చూసి నేను పూర్తిగా దిగ్భ్రాంతి చెందాను. మనం ఇక్కడ ఎలాంటి క్రికెట్‌ను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాం? కేవలం వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో కాస్త బ్యాటింగ్ చేయగలరన్న కారణంతో, మీ ప్రధాన అటాకింగ్ బౌలర్‌ను తొలగిస్తారా? అని సీరియస్ గా ప్రశ్నించాడు హర్భజన్ సింగ్. మీకు ఒక చేదు నిజం చెబుతాను వికెట్లు తీయడం ద్వారానే అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలవాలి, అంతేగానీ బ్యాటింగ్ డెప్త్ అనే భ్రమ వెనుక దాక్కోవడం ద్వారా కాదన్నాడు.
గాలిలో సరైన వైవిధ్యం లేదా డ్రిఫ్ట్ లేకపోతే, అసలైన విదేశీ పిచ్‌లపై ఇంగ్లీష్ బ్యాటర్లు రోజంతా ఫింగర్ స్పిన్నర్లను ఎదుర్కొంటారు. కుల్దీప్ యాదవ్ ఒక నిరూపితమైన, ధృవీకరించబడిన మ్యాచ్ విన్నర్. అతను మధ్య ఓవర్లలో భాగస్వామ్యాలను విడగొడతాడు. అలాంటి ఎక్స్-ఫ్యాక్టర్‌ను మీరు ఐపీఎల్ ప్రయోగశాలలో లేదా ఆల్-రౌండర్లను సేకరించడం ద్వారా సృష్టించ లేరన్నాడు. మీ టాప్-ఆర్డర్ క్రీజులో నిలదొక్కుకోవాలనే ఆందోళనను కప్పి పుచ్చుకోవడానికి, మీ బ్యాటింగ్‌ను విస్తరించాలనే ఉద్దేశంతో ఒక మ్యాచ్ విన్నర్‌ను జట్టు నుండి తొలగించ కూడదన్నాడు. గెలవడానికి ఆడండి, ఓడిపోకుండా ఉండేందుకు ఆడకండి అని సూచించాడు భజ్జీ.



















