హైదరాబాద్ : జొజిల్లా సొరంగ మార్గం సంచలనంగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత శ్రీనగర్ – లడఖ్ మధ్య 365 రోజులపాటు నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ద్రాస్, కార్గిల్, లేహ్ తదితర ప్రాంతా ప్రజలకు సరుకులు, అత్యవసర సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. అలాగే వ్యూహాత్మకంగా కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రవాణా, లాజిస్టిక్స్ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుంది. జోజిలా టన్నెల్ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహం, వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు దోహద పడటమే కాకుండా, దేశ భద్రత పరంగా కూడా అత్యంత కీలకమైన మౌలిక సదుపాయంగా జోజిలా టన్నెల్ నిలుస్తుంది.
పశ్చిమ హిమాలయాల్లోని అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, హిమపాతాల ముప్పు, తీవ్రమైన శీతాకాలం వంటి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న జోజిలా టన్నెల్ తుది బ్రేక్‌త్రూ భారతదేశం అత్యంత క్లిష్టమైన పర్వత ప్రాంత రవాణా మౌలిక సదుపాయాల నిర్మాణంలో సాధించిన అసాధారణ విజయానికి నిదర్శనం . జోజిలా టన్నెల్ పూర్తి ఐన తరువాత కాశ్మీర్–లడఖ్ మధ్య అన్ని కాలాల్లో నిరంతర అనుసంధానం కల్పించడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధి, ఆర్థిక సమగ్రత, జాతీయ భద్రతా సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుంది.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 2020 అక్టోబర్ ఒకటిన ప్రారంభమైంది. తుది బ్రేక్ త్రూ మంగళవారం జరగనుంది. ప్రాజెక్ట్ లో భాగమైన నిల్‌గ్రార్ టన్నెల్‌లో తొలి బ్లాస్టింగ్ 2020 అక్టోబర్ 14న జరిగింది. అప్రోచ్ రోడ్లు, వంతెనలు, నిల్‌గ్రార్ జంట టన్నెల్లు, కట్-అండ్-కవర్ పనులు, స్నో గ్యాలరీలతో కూడిన మొదటి దశ గత ఏడాది మార్చి 15న పూర్తి ఐంది . ప్రధాన జోజిలా టన్నెల్ తుది బ్రేక్‌త్రూమంగళవారం జరగనుంది. జోజిలా టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో -20° డిగ్రీల నుంచి -3- డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. ప్రతి ఏడాది వంద రోజుల పాటు అక్కడ ఇలాంటి వాతావరణమే ఉంటుంది. మంచు తుఫానులు ఇక్కడ సర్వ సాధారణం. అలాంటి విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ 1200 మంది కార్మికులు టన్నెల్ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. వీరిలో 80 శాతం మంది స్థానికులే.
గత ఐదేళ్లలో జోజిలా టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో ఐదు ప్రధాన హిమపాత ఘటనలు (మంచు తుఫానులు ) చోటు చేసుకున్నాయి. వాటిలో రెండు అత్యంత తీవ్రమైనవి. వీటి వల్ల యంత్రాలు, పరికరాలు, వర్క్‌షాపులకు గణనీయమైన నష్టం కలిగింది. మూడేళ్ళ క్రితం సంభవించిన భారీ మంచు తుఫానులో ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పని చేసే 172 మంది కార్మికులు చిక్కుకు పోయారు. వారిని మన సైన్యం సురక్షితంగా బైటకు తీసుకొచ్చింది. తొలిసారి సర్బల్ ప్రాంతంలో 2023 జనవరి 12న భారీ హిమపాతం నమోదైంది . అదే నెల 15న రెండో భారీ హిమపాతం అనంతరం చిక్కుకుపోయిన 172 మంది కార్మికులను భారత సైన్యం రక్షించింది.
2024లో ఫిబ్రవరి నెలలో రెండుసార్లు, మార్చిలో మరోసారి హిమపాతాల కారణంగా అత్యవసర భద్రతా చర్యలు చేపట్టి మంచును తొలగించి పనులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. భారీ మంచు పేరుకుపోయే శీతాకాలంలో చిన్న, పెద్ద స్నో బ్లోవర్లను వినియోగించి నిర్మాణ పనులు అంతరాయం లేకుండా కొనసాగించడంతో పాటు జాతీయ రహదారిని వాహనాల రాకపోకలకు టన్నెల్ నిర్మణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ అందుబాటులో ఉంచింది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా 1 కోటి సేఫ్ మ్యాన్-అవర్స్ ను ఈ ప్రాజెక్ట్ సొంతం చేసుకుంది.
