తాడేపల్లిగూడెం : రాష్ట్రానికి చెందిన తూర్పు కాపుల న్యాయమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనే ప్రధాన డిమాండ్ కు తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ రెడ్డి. తాడేపల్లిగూడెంలో తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ప్రతినిధులు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ వర్తించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తూర్పు కాపులను బీసీలుగా గుర్తిస్తూ జీవో నంబర్ 82 జారీ చేసిన విషయాన్ని సంఘం ప్రతినిధులు గుర్తు చేశారు. అయితే, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తూర్పు కాపులకు కేంద్ర ఓబీసీ రిజర్వేషన్ వర్తించక పోవడంతో విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర స్థాయిలో బీసీ గుర్తింపు ఉన్నప్పటికీ, కేంద్ర ఓబీసీ జాబితాలో తగిన గుర్తింపు లేకపోవడం వల్ల కేంద్ర విద్యా సంస్థల్లో ప్రవేశాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర రిజర్వేషన్ ప్రయోజనాలు అందడం లేదని వివరించారు. ఈ సమస్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తూర్పుకాపు విద్యార్థులు, నిరుద్యోగ యువత అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC) ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించిన విషయాన్ని సంఘం ప్రతినిధులు ప్రస్తావించారు. అప్పటి ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు కాపుల సమస్యను ఓబీసీ కమిషన్ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో తూర్పుకాపుల సమస్యను ప్రస్తావించి, వారిని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటే లక్షలాది మంది ప్రయోజనం పొందుతారని వైయస్ జగన్‌కు వివరించారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. సంఘం ప్రతినిధులు వివరించిన సమస్యలను వైయస్ జగన్ సావధానంగా విన్నారు. తూర్పు కాపుల న్యాయమైన డిమాండ్‌కు వైఎస్సార్‌సీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ ఎంపీల ద్వారా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించేలా కృషి చేస్తామని, తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ ప్రయోజనాలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
