అమరావతి : గోదావరి – కావేరి నదులను అనుసంధానం చేస్తే దక్షిణాది రాష్ట్రాలు కళకళ లాడుతాయని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2,000 టీఎంసీల నీరు సముద్రంలోకి ప్రవహిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానం దక్షిణ రాష్ట్రాలను కరువు సమస్య నుండి విముక్తి చేయగలదని అన్నారు. కనీసం 200 టీఎంసీల గోదావరి వరద నీటిని వినియోగించుకుంటే రాయలసీమ ప్రాంతం పచ్చదనంతో, పంటలతో కళకళలాడుతుందని ఆయన అన్నారు. గోదావరి, కృష్ణా నదులను తమ ప్రభుత్వమే అనుసంధానం చేసిందని చెప్పారు. గోదావరి పుష్కరానికి ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అంకితం చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే మూడేళ్లలో రూ. 35,000 కోట్ల విలువైన 36 నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టుల పూర్తికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని ఆయన అన్నారు. మేము 90 లక్షల కుటుంబాలకు, 48,000 గ్రామీణ ప్రాంతాలకు , 3.30 కోట్ల మంది ప్రజలకు నీటిని అందించేందుకు చర్యలు అమలు చేస్తున్నాము అని చంద్రబాబు నాయుడు అన్నారు. జల్ జీవన్ మిషన్‌ను బలహీన పరుస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. జల్ జీవన్ మిషన్ కింద ఉత్తర ప్రదేశ్ (రూ. లక్ష కోట్లు), మధ్యప్రదేశ్ (రూ. 83,000 కోట్లు), కేరళ (రూ. 85,000 కోట్లు) వంటి రాష్ట్రాలు కేంద్రం నుంచి గణనీయమైన నిధులు పొందగా, గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ. 2,600 కోట్లు మాత్రమే కేటాయించి అన్యాయం చేసిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగా గ్రామాలు రోడ్లు, వీధి దీపాలు, నీరు లేకుండా నష్ట పోయాయని ఆయన ఆరోపించారు.
‘పల్లె పండుగ’ చొరవ ద్వారా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడానికి రూ. 11,085 కోట్ల విలువైన పనులను చేపట్టామని ఆయన అన్నారు. విజయవాడ, విశాఖపట్నం, మంగళగిరితో సహా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 52,000 కోట్ల విలువైన నివాస స్థలాలకు గృహ పట్టాలను (హక్కు పత్రాలను) పంపిణీ చేశామన్నారు సీఎం. రాయలసీమ ప్రాంత భవిష్యత్తును, దిశను మార్చే లక్ష్యంతో రూ. 1 లక్ష కోట్ల విలువైన ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అందించాలనే లక్ష్యం దిశగా తాము పని చేస్తున్నామని చెప్పారు. ఈ చొరవలో భాగంగా 19 లక్షల ఇళ్లను నిర్మిస్తామని వెల్లడించారు.
