అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని మోదీ చేసిన పొదుపు సూచనలపై స్పందించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష చేపట్టారు. శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని వివిధ శాఖలకు సీఎం దిశానిర్దేశం చేశారు.స్టేట్ ఓన్ రెవెన్యూస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,04,345 కోట్లుగా ఉంటే… 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,10,643 కోట్లుగా నమోదైందని వెల్లడించారు ఉన్నతాధికారులు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ నుంచి రూ.33,679 కోట్లు, గనులు శాఖ నుంచి రూ. 10,300 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రూ.11,047 కోట్ల మేర ఆదాయం సమకూరనుందని పేర్కొన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఓన్ రెవెన్యూలో 6 శాతం వృద్ధి నమోదు అయ్యిందని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,27,506 కోట్ల మేర ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గనులు, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదాయంలో ప్రతీ రూపాయీ సద్వినియోగం అయ్యేలా ప్రభుత్వ శాఖలు చూడాలని అన్నారు. సమీక్షకు హాజరైన సీఎస్ సాయి ప్రసాద్, ఆర్ధిక, రవాణా, ఎక్సైజ్, గనులు, స్టాంపులు రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, అటవీ, పురపాలక శాఖల అధికారులు.
















