అమరావతి : భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచి పోయిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శనివారం అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయాన్ని పీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈ ఎయిర్ పోర్టును జాతికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా సీఎం ప్రసంగించారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేను, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చామని, ఇప్పుడు దానిని నిలబెట్టు కున్నామని ప్రకటించారు. ఎర్రబస్సు రాదన్నారు కానీ ఎయిర్ బస్ వచ్చిందన్నారు. అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారంటూ ఎద్దేవా చేశారు. వాళ్లు అడుగడుగునా అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఇంకా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కానీ తాము ముందుకే వెళతామన్నారు సీఎం.
అల్లూరి పేరు తలుచుకుంటే గుండె ఉప్పొంగుతుందని, అందుకే ఆయన పేరును భోగాపురం ఎయిర్ పోర్టుకు పెట్టాం అని వెల్లడించారు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు అని పేర్కొన్నారు సీఎం. ఉత్తరాంధ్ర వాసి జీఎమ్మార్ ఈ ఎయిర్ పోర్టు నిర్మించారని, ఈ సందర్బంగా ఏపీకి తను గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలి అడుగులు వేయించింది గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ప్రస్తుత విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుది అన్నారు. ఈ ఇద్దరిదీ ఉత్తరాంధ్ర కావడం విశేషమన్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సెంటిమెంట్ నిలబెట్టింది ప్రధాని నరేంద్ర మోదీ అని ప్రశంసించారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం, రాజధాని అమరావతికి నిధులు ఇచ్చింది కూడా పీఎం అని చెప్పారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం.. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం అని ప్రకటించారు.
















