హైదరాబాద్ : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సర్కార్ మహిళల భద్రత, సాధికారత కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల అన్వేషణలో గ్రామీణ ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు వచ్చే మహిళలకు సురక్షితమైన వసతి కల్పించేందుకు ప్రభుత్వంవర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తోందని సీతక్క తెలిపారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నం. 12లో ‘సఖి నివాస్’ (వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్) , ‘సఖి కేంద్రం’ (వన్ స్టాప్ సెంటర్)లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళల భద్రతకు ఎక్కువగా ప్రాదాన్యత ఇస్తున్నామన్నారు. ఈ హాస్టల్‌లో సుమారు 150 మంది మహిళలకు వసతి సౌకర్యాలు కల్పించినట్లు ఆమె తెలిపారు. చిన్న పిల్లలతో వచ్చే తల్లులు కూడా ఇక్కడ బస చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. మహిళల భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పని చేస్తోందని సీతక్క పేర్కొన్నారు.
మహిళల పురోగతిని సహించలేక కొందరు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే అటువంటి విమర్శలు మహిళా శక్తి ముందు నిలబడలేవని ఆమె అన్నారు. మహిళల అభివృద్ధిని జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలకు మహిళలే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచిందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, మహిళా సూపర్ మార్కెట్ల వంటి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఒకప్పుడు తమ ఖర్చుల కోసం ఇతరులపై ఆధార పడాల్సిన దుస్థితి నుండి నేడు వారు ఇంటి ఖర్చులను భరించే స్థాయికి, పిల్లల చదువుల బాధ్యతను స్వీకరించే స్థాయికి, అంతేకాక నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారని ఆమె పేర్కొన్నారు.
