అమరావతి : కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్యుడికి సాంత్వన చేకూర్చేలా తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని పేర్కొన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52లకు, గ్రేడ్ 1 పచ్చి బియ్యం ( రా రైస్ ) రూ.50లకు రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైసు మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను అభినందించారు.
సామాన్యుడిపై ధరల భారం పడకుండా కూటమి ప్రభుత్వం తరఫున ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం స్వాగతించదగినదని అన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల. బహిరంగ మార్కెట్ ధరలను సమీక్ష చేసి, మిల్లర్లతో అత్యవసరంగా సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండేలా మేలైన ధరలను నిర్ణయించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ పాలన పరమైన నిర్ణయం సామాన్య ప్రజల ఆర్థికభారాన్ని తగ్గిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం. ఇదిలా ఉండగా ఏపీ కూటమి ప్రభుత్వం సుస్థిరమైన పాలనను అందిస్తుండడంతో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పేదరిక నిర్మూలన కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయాలని సూచించారు.
