అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సుంకాల విధింపు తర్వాత ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. నాలుగు వారాల్లో జి జిన్‌పింగ్‌ను కలుస్తానని ట్రంప్ వెల్లడించారు. ఈనెలాఖరులో దక్షిణ కొరియాలో ఆసియా ఫసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశం (అపెక్) సదస్సు జరగనుందన్నారు. ఈ కీలక సదస్సుకు తాను ప్రత్యేకంగా హాజరవుతున్నట్లు తెలిపారు . వచ్చే ఏడాది తాను చైనాకు వెళ్తానని కూడా ఆయన అన్నారు. అమెరికా సోయాబీన్ కొనుగోళ్లపై ఒత్తిడి తీసుకు రావాలని యోచిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఎందుకంటే అమెరికన్ రైతులు తాము విధించిన వాణిజ్య యుద్ధాల పర్యవసానాలతో ఇబ్బంది పడుతున్నారని ఎట్టకేలకు ట్రంప్ గహ్రించారు.
ఇందులో ప్రధానంగా తమ దేశంలో అత్యధికంగా సోయా బీన్స్ పండిస్తున్నారని, దీనిని కొనుగోలు చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయాన్ని ఆయన పదే పదే తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాను జిన్ పింగ్ తో కలిసే సమయంలో ప్రధానంగా సోయాబిన్ పైనే ఎక్కువగా చర్చకు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ప్రారంభంలో వాషింగ్టన్ , బీజింగ్ పరస్పరం సుంకాల యుద్ధంలో పాల్గొన్న తర్వాత, ఒకరి ఎగుమతులపై పెరుగుతున్న సుంకాలను విధించిన తర్వాత ఈ చర్చలు జరిగాయి. అప్పటి నుండి రెండు వైపులా ఉద్రిక్తతలను తగ్గించడానికి అంగీకరించినప్పటికీ ఇంకా ప్రతిష్టంభన నెలకొంది. దీంతో జిన్ పింగ్ తో స్వయంగా కలవాలని కోరుకుంటున్నారు.
