అమరావతి : తెలుగుదేశం పార్టీ చీఫ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ. ఏప్రిల్ 20వ తేదీన ఆయన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పుట్టారు. రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన బర్త్ డే సందర్బంగా భార్య నారా భువనేశ్వరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ముందు చూపు కలిగిన అరుదైన రాజకీయ నేత అని పేర్కొన్నారు భువనేశ్వరి. ఆయన పుట్టిన రోజు సందర్బంగా భారీ విరాళాన్ని ప్రకటించారు.
ఇదిలా ఉండగా తమ మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా 12 ఏళ్లుగా ప్రతీ ఏటా తిరుమలలో అన్న ప్రసాదానికి రూ.44 లక్షలు విరాళంగా ఇస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. బాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. తన పేరు మీద అన్న క్యాంటీన్లకు ఒక రోజు అన్నదానానికి రూ.76 లక్షల విరాళం ఇచ్చిన తన సతీమణి భువనేశ్వరిని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… “రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలలో భక్తుల సహకారంతో 4 దశాబ్దాలుగా అన్నదానం జరుగుతోంది.
అలాగే ప్రముఖ దేవాలయాల్లోనూ అన్నదానం నిర్వహిస్తున్నాం. పేదలకు రూ.5 లకే కడుపు నింపే అన్న క్యాంటీన్ సేవలను మరింత విస్తరించాలి. నాణ్యతను పాటించడంతో పాటు..పవిత్రంగా, గౌరవంగా, పరిశుభ్రంగా ఆహారం అందించే ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని కోరారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు సహా తమకు నచ్చిన రోజు భోజనాలకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఇదొక స్ఫూర్తి దాయకమైన కార్యక్రమంగా మారి బ్రాండ్ ను సృష్టించాలి అని చంద్రబాబు అన్నారు.
















