కోల్ కతా : మెస్సీ గోట్ టూర్ సందర్బంగా కోల్ కతాలో శనివారం చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో శనివారం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డీజీపీ రాజీవ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మెస్సీ రాక సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. నిర్వాహకుల కోరిక మేరకు సెక్యూరిటీ ఇచ్చామన్నారు. అయితే సాల్ట్ లేక్ స్టేడియం పూర్తిగా అభిమానులతో నిండి పోయిందన్నారు డీజీపీ రాజీవ్ కుమార్. అయితే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కావడం, కుర్చీలు ఎత్తేయడం, కొంత గందరగోళానికి దారి తీసిందన్నారు.
దీంతో శాంతి భద్రతల దృష్ట్యా తమ పోలీసులు లాఠీలు ఝులిపించారని చెప్పారు. కావాలని లాఠీఛార్జ్ చేయలేదన్నారు. అయితే దీనికి , ఇలా జరగడానికి ప్రధాన కారణం మెస్సీ ఆడక పోవడం వల్లే నని స్పష్టం చేశారు రాజీవ్ కుమార్. తమ అభిమాన ప్లేయర్ ఆడాలంటూ కోరారని, తను ఆడేందుకు రాలేదని నిర్వాహకులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్లనే ఇలా గందరగోళానికి దారి తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు డీజీపీ రాజీవ్ కుమార్. కాగా జరిగిన ఘటనకు సంబంధించి టికెట్ డబ్బులు వాపస్ చేస్తామని నిర్వాహకులు లిఖిత పూర్వకంగా మాట ఇచ్చారని చెప్పారు. ఇప్పటికే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
