ముంబై : సూసైడ్ చేసుకున్న ఐఐటీ బాంబే విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఎంపీ రాహుల్ గాంధీ. న్యాయం కోసం జరిగే పోరాటంలో మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి న్యాయం దక్కేంత వరకు తాను మీతోనే ఉంటానన్నారు. ఈ విద్యార్థి మరణంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది, అదే సమయంలో ఐఐటీ బాంబే అధికారులపై ఆరోపణలు వచ్చాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గురువారం తెలిపింది. సాహిల్ మరణం తర్వాత, అతని కుటుంబం ఐఐటీ బాంబే యంత్రాంగం , కొంతమంది అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును దర్యాప్తు ముమ్మరం చేసింది.
ఈ కేసు విషయంలో తమ భవిష్యత్తు వ్యూహం , తదుపరి కార్యాచరణను ఆ సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. కాగా, క్యాంపస్‌లో నిరసనలకు దారితీసిన ఆ ద్వితీయ సంవత్సరం విద్యార్థి మరణం తర్వాత, ఐఐటీ బాంబేలో సాధారణ తరగతులు తిరిగి ప్రారంభమయ్యాయని వర్గాలు తెలిపాయి. సాహిల్ మరణంపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని, అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. ఈ కేసు గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ రవీంద్ర వాకోడే (20) దురదృష్టకర మరణం తర్వాత, పోవాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు (DCB CID C.R. నం. 124/2026గా) బదిలీ చేశామన్నారు.
















