హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు. ఇప్పటికే మొదటి విడత కింద అర్హులైన వారికి ఇండ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇప్పటికే చాలా చోట్ల పూర్తయిన ఇండ్లను ప్రారంభించారు ఆయా జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు. తాజాగా శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు . ఈ సందర్భంగా నియోజకవర్గంలో గృహ నిర్మాణ ప్రగతిని అధికారులు వివరించారు.
L3 జాబితాలో ఉండి మంజూరు అయినప్పటికీ పేమెంట్లు నిలిచి పోయిన లబ్ధిదారుల బిల్లులను వెంటనే విడుదల చేస్తాం అన్నారు జూపల్లి కృష్ణారావు. ఈ నెలాఖరులోగా L3 జాబితాలో ఉన్న అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తాం అని ప్రకటించారు. అలాగే కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఇప్పటివ రకు అందజేసిన రెవెన్యూ వినతుల్లో ఇంకా పరిష్కారం కానివాటిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.
ఇకనుంచి ప్రజల సమస్యలను ముందుగానే సంబంధిత శాఖలకు పంపించి, వాటి పరిష్కారం కోసం కలెక్టరేట్ స్థాయిలో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తాం అన్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు సమీక్ష సమావేశాల్లో పాల్గొని, వినతి ఏ అధికారి పరిధిలోకి వస్తుందో అదే రోజు నిర్ధారించి, సంబంధిత అధికారి వెంటనే నివేదిక సమర్పించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను అమలు చేస్తాం అన్నారు.

















