అమరావతి : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియ జేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారనే అంశం సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం-RSKలను ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణ ఎంత మాత్రమూ కాదన్నారు.
పాస్ పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయని వెల్లడించారు చంద్రబాబు నాయుడు. పాస్ పోర్టు సేవా కేంద్రాల పనితీరు ఏ విధంగా జరుగుతుందో… ఆ తర్వాత ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో వివరించాలని ఆదేశించారు. పాస్ పోర్టు సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక పాస్ పోర్టు ప్రాసెసింగ్ అనేది చాలా సులువైంది. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పనితీరు ఉంటుందన్నారు. అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల విషయంలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే లాభాలను వివరించాలి. అలాగే డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతాం అన్నారు.
