ప్రభుత్వ పాలిటెక్నిక్ ల‌ను ప్రైవేటీక‌రించం

మాసాబ్ ట్యాంక్ లో విద్యార్థులతో మంత్రి వివేక్ భేటీ

hellotelugu-Vivek

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ ల‌లో మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు కార్మిక‌, గ‌నుల శాఖ మంత్రి వివేక్ వెంక‌ట స్వామి. హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులను పరామర్శించారు. వారి సమస్యల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాలిటెక్నిక్‌లను విద్యుత్ శాఖ పరిధిలోకి తీసుకు రావడంపై విద్యార్థులలో ఉన్న సందేహాలు, అపోహలు, ఆందోళనలను ఆయన ఓపికగా విని, ప్రతి అంశంపై స్పష్టత ఇచ్చారు. విద్య, ఫీజులు, పరీక్షలు, డిప్లొమా గుర్తింపు, ఈసీఈటీ, లాటరల్ ఎంట్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్టైపెండ్‌లు మొదలైన అంశాలపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల ప్రయోజనాలకు ఎలాంటి అంతరాయం కలగదని ఆయన హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్‌లలో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడానికి, పరిశ్రమలతో అనుసంధానం కావడానికి, మెరుగైన ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.

పాలిటెక్నిక్‌లను ‘పవర్’ విభాగానికి తరలించడం వల్ల ఎటువంటి మార్పులు ఉండవు. మీ చదువులు ఇప్పుడు ఉన్నట్లే యథాతథంగా కొనసాగుతాయి. ఏఐసీటీఈ గుర్తింపు, పరీక్షలు , డిప్లొమా సర్టిఫికెట్లు అన్నీ మునుపటిలాగే జరుగుతాయని స్ప‌ష్టం చేశారు. ఫీజుల విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రస్తుత ఫీజుల విధానం కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, విద్యార్థులకు ఉపకార వేతనాలు (స్టిపెండ్‌లు) అందించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు వివేక్ వెంక‌ట‌స్వామి. మీపై ఎటువంటి అదనపు ఆర్థిక భారం పడకుండా తాము చూసుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. తప్పకుండా, ఈసీఈటీ పరీక్ష కొనసాగుతుంది. ప్రస్తుత విధానం అమలులో ఉంటుంది. ఈసీఈటీ ద్వారా బీ.టెక్ రెండవ సంవత్సరంలోకి లాటరల్ ఎంట్రీ అవకాశం కూడా కొనసాగుతుంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైతే, స్పష్టత కోసం తాము ఒక ప్రత్యేక జీవో జారీ చేస్తామన్నారు.

మీ డిప్లొమాకు ఉన్న ప్రస్తుత గుర్తింపు, విలువ పూర్తిగా కొనసాగుతాయని ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ విలువను పెంచడమే మా ప్రభుత్వ లక్ష్యం. స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలకు ఉన్నతీకరించి, మరిన్ని అవకాశాలు కల్పించాలని యోచిస్తున్నామ‌న్నారు.
పాలిటెక్నిక్ ల‌ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు. పాలిటెక్నిక్‌లు ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి. విద్య, పరీక్షలు, ఫీజులు, విద్యార్థి ప్రయోజనాలు ప్రభుత్వ పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక శిక్షణ, సీఎస్ఆర్ నిధులు తీసుకు రావడానికే పరిశ్రమలను ఇందులో భాగస్వాములను చేస్తున్నామ‌న్నారు.

Exit mobile version