ప్రారంభానికి ముస్తాబైన సున్నం చెరువు

అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : హైడ్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పునరుద్ధరించిన సున్నం చెరువు ప్రారంభానికి సిద్ధమైంది. డిసెంబర్ 2 లేదా 3వ‌ తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన బలమైన ఫెన్సింగ్, పాత్ వే, బండ్ నిర్మాణాన్ని తనిఖీ చేశారు. ప్రవేశ ద్వారాలు, చెరువు చెంతన ఉన్న పెద్ద బండరాయి పైన ఏర్పాటు చేసిన వ్యూ పాయింటు ను సందర్శించారు. పార్కులు, చిల్డ్రన్ ప్లే ఏరియాలను, ఓపెన్ జిమ్ ను పరిశీలించారు. హైడ్రా అడిషనల్ కమిషనర్ డి. ఆనందకుమార్, హైడ్రా ఏసీపీ తిరుమల్ తో పాటు ఇత‌ర‌ ఉన్నతాధికారులు కమిషనర్ పర్యటనలో ఉన్నారు.

ఆక్రమణలకు గురై.. మురికి కూపంగా సున్నం చెరువు దుర్గంధ భరితంగా మారింది. ఆక్రమణలతో 14 ఎకరాలకు పరిమితమైన చెరువును హైడ్రా 32 ఎకరాలకు విస్తరించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు తొలగించిన సమయంలో ఎన్నో నిరసనలు, ఆందోళనలు కొన‌సాగాయి. కానీ ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగాక‌ ఆ చెరువు ఆహ్లాదంగా మారింది. 1.35 కిలోమీటర్ల పాత్ వే స్థానికులకు ఆరోగ్య ప్రదాయినిగా మారింది. అన్ని వయసు లవారికి దేహ దారుఢ్యానికి ఊతమిచ్చేలా అక్కడ ఓపెన్ జిమ్ తయారయ్యింది. అంతే కాదు గుట్టలబే గంపేట, నవభారత నగర్ తదితర ప్రాంతాలకు వరద ముప్పును సున్నం చెరువు తప్పించింది. గతంలో 47.58 మిలియన్ లీటర్లకు పరిమితమైన చెరువు ఇప్పుడు నీటి నిలువ సామర్థ్యం 200 మిలియన్ లీటర్ల కు పెరిగింది. నీరు నిలువ ఉండే ప్రాంతం 9 ఎకరాల నుంచి 16 ఎకరాలకు పైగా పెరిగింది. చెరువుకు ఇన్లెట్లు, ఔట్లెట్లు సరి చేయడంతో పాటు అభివృద్ధి చేయడంతో ఈ ప్రాంతానికి వరద ముప్పు తప్పింది. పార్కులు ఆహ్లాదాన్ని అందిస్తుండగా.. పెద్ద రాతి కొండపై హైడ్రా ఏర్పాటు చేసిన చెరువు వ్యూ పాయింటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Exit mobile version