మంగళగిరి : ప్రభుత్వ పాఠశాలలను చూసి అసూయ పడేలా చేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన విద్యార్థుల తల్లులతో మంగళగిరి బైపాస్ కొండపనేని టౌన్ షిప్ పార్క్ లో మంత్రి లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగ పడుతోందనే విషయాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషి చేస్తున్నాం. అన్నారు. గతంలో ప్రైవేటు పాఠశాలలను చూసి అసూయ పడేవాళ్లం అని చెప్పారు నారా లోకేష్. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను చూసి ప్రైవేటు పాఠశాలలు అసూయ పడేలా చేస్తామని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పాఠశాలలో ప్రవేశాల కోసం విపరీతమైన పోటీ ఉందన్నారు నారా లోకేష్. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో లీప్ పాఠశాలలను తీర్చిదిద్దుతాం అని తెలిపారు. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం విద్యనే తప్పా మరోటి కాదన్నారు. సమాజంలో మార్పునకు, రాష్ట్ర అభివృద్ధికి విద్యే ప్రధానం అని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం అన్నారు. ఈ ఏడాది మరో 3 వేల పోస్టులు భర్తీ చేస్తాం అని ప్రకటించారు. పది వేలకు పైగా పాఠశాలల్లో వన్ క్లాస్-వన్ టీచర్ విధానం తీసుకువచ్చాం అన్నారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 1,06,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు తరలి వచ్చారని మంత్రి అన్నారు.
