ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని, రాష్ట్రంలోనే టాప్ లో నిలిచేలా చేస్తామన్నారు తుమ్మిడిహట్టి వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఈ జిల్లా పంట పొలాలకు నీళ్లిస్తామని చెప్పారు. త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాకు విశ్వ విద్యాలయం మంజూరు చేస్తామని ప్రకటించారు. ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు, చనాక – కొరాట ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, విమానాశ్రయం, విశ్వ విద్యాలయం ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి పలు కీలక అంశాలను వివరించారు.
అత్యంత వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. సమీక్షా సమావేశం నిర్వహించి ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు . ఎక్కడైతే ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యునికేషన్ సరిగా ఉంటుందో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. జిల్లాకు ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఏటీసీ మంజూరు చేశామన్నారు. మెడికల్ కాలేజీ ఇచ్చామని తెలిపారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత జిల్లాకు విశ్వవిద్యాలయం ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు.
