హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని రాయసముద్రం (రామచంద్రాపురం) చెరువును సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ అన్నారు. ఈమేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. గతంలో ఉన్న ప్రతిపాదనల మేరకు హెచ్ ఎం డీఏ అభివృద్ధి చేస్తే ఇందుకు ఉన్న ఆటంకాలను తొలగించి.. అభివృద్ధిలో సహకరిస్తామన్నారు. చెరువు అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని స్థానిక అధికారులు, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
చెరువు ఇన్‌లెట్లను, ఔట్‌లెట్లు ఎలా ఉన్నాయో గమనించి స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. రాయసముద్రం చెరువు సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉందని చెప్పారు. ఈ చెరువును కేవలం ఒక నీటి వనరుగానే కాకుండా.. స్థానికులకు ఆహ్లాదాన్ని పంచే ఒక చక్కని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం ప్లే ఏరియా, పార్కులు, అన్ని వయసుల వారు వ్యాయామం చేయడానికి పరికరాలు అందుబాటులోకి వస్తాయన్నారు ఏవీ రంగనాథ్. వలస పక్షులకు నిలయంగా ఉన్న ఈ చెరువును పూర్తి స్థాయిలో కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబద్ నగరంలో ప్రభుత్వ ఆస్తులను ఎవరు ఆక్రమించినా లేదా ఆక్రమించాలని చూసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి హైడ్రా చూస్తూ ఊరుకోదని అన్నారు.

















