హైదరాబాద్ : సహజ వరద కాలువలను రూటు మార్చడం, ఆక్రమణలకు పాల్పడడం, పైపులు వేసి వాటిపై రహదారులు నిర్మించడం వంటి పనులతో వరద ప్రవాహానికి ఆటంకాలు సృష్టిస్తున్నారని హైడ్రా ప్రజావాణిలో పలు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. కాలువలను కబ్జా చేయడంతో వరద ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. వర్షం నీరు రహదారులపై నిలవకుండా కాలువలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమీన్‌పూర్ పెద్ద చెరువులో 50 సర్వే నంబర్లలోని 20 వరకూ లే ఔట్లు మునిగి పోయాయని, ఇందులోని ప్లాట్ల యజమానులకు టీడీఆర్ ద్వారా తగిన నష్ట పరిహారం వచ్చేలా చూడాలని యజమానులు ఫిర్యాదు చేశారు. అలాగే తమ నివాసాలకు దారిలేకుండా ఆటంకాలు సృష్టిస్తున్నాయని, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ హైడ్రా ప్రజావానికి మొత్తం 52 ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
వర్షపు నీటి కాలువను భూగర్భ పైప్‌లైన్‌గా మార్చి సుమారు ఎనిమిది అడుగుల మేర భూమిని ఎత్తు పెంచేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు అని బేగంపేటలోని మెథడిస్ట్ కాలనీ సంక్షేమ సంఘంహైడ్రాకు ఫిర్యాదు చేసింది. భవిష్యత్తులో కాలువల్లో పూడిక తీయాలన్న చాలా ఇబ్బందులు ఉంటాయని ..ప్రతిపాదిత పనులపై సాంకేతిక అంశాలను పరిశీలోంచి తగిన చర్యలు తీసుకోవాలని హైడ్రాను కోరింది. హయత్‌నగర్ మండలం రాజరాజేశ్వరి కాలనీ ఫేజ్-2 సర్వే నంబర్ 189/1లో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో 1983లో ఏర్పాటైన లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపసుతున్నారని కాలనీ సంక్షేమ సంఘం హైడ్రాకు ఫిర్యాదు చేసింది. లేఅవుట్ ఆమోదం పొందినప్పటి నుంచి పార్కు స్థలం ప్రజల వినియోగంలో ఉండగా, అనంతరం నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిపి ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించింది.
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల మండలం మన్నెగూడలోని ప్రముఖ్ టౌన్‌షిప్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ప్రముఖ్ టౌన్‌షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. సంబంధిత సర్వే నంబర్లలో సమగ్ర విచారణ నిర్వహించాలని కోరింది. ఇదే జిల్లాలోని కొండాపూర్‌లో సైబర్ విలేజ్లో వరద, మురుగు కాలువల నిర్వహణ సరిగా లేక ఏమాత్రం వర్షం పడినా కాలనీలో నీరు నిలిచి పోతోందని.. దీనికి హైడ్రా పరిష్కారం చూపాలని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు.
















