అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వ్యతిరేక ఆలోచనలతో కాకుండా సానుకూల దృక్ఫథంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
బుధవారం సచివాలయంలో హెచ్వోడీలు, కార్యదర్శుల సదస్సు జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కీలక సూచనలు చేశారు సీఎం. ప్రతి ఒక్కరిని ప్రేరేపించేలా చంద్రబాబు పలు సూచనలు చేశారు. అధికారులు ఎవరూ ప్రతికూల ఆలోచనలు చేయవద్దన్నారు. ఏ పని చెప్పినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కొందరు ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారని, ఎలా ఆ పని చేయకుండా ఉండాలి అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ పద్దతిని విడనాడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక కార్యక్రమం తలపెట్టినా, ఒక ఆదేశం ఇచ్చినా సానుకూలంగా తీసుకుని దాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు.
ప్రభుత్వంలో ఏ స్థాయిలో అధికారి అయినా పాజిటివ్ ఆలోచనలతో పనిచేయాలని అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. చాలా మంది అధికారులు ఎంతో అద్భుతంగా పనిచేస్తారు…మంచి ఫలితాలు చూపిస్తారు అయితే వారి వ్యవహార శైలి, అనుసరించే విధానం కూడా బాగుండాలి. ప్రజలు, అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించే విధానాన్ని అలవర్చుకోవాలి. ఎంత మంచి ఫలితం సాధించినా…ఆ అధికారి ప్రవర్తన కూడా ముఖ్యమే అని సీఎం అన్నారు. ప్రభుత్వంలో అనేక శాఖల్లో 18 నెలల్లో చాలా మార్పులు తెచ్చాం. అయితే దేవాదాయ, రెవెన్యూ శాఖల్లో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. ఈ రెండు శాఖలు ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక మార్పులు తెచ్చాం. ఆ తరహా మార్పులు దేవాదాయ శాఖలోని ప్రతి దేవాలయంలో రావాలని అన్నారు చంద్రబాబు నాయుడు.
