ఆరోగ్య సంర‌క్ష‌ణపై దృష్టి సారించాలి : సీఎం

గుండె వ్యాధుల నివార‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాలి

hellotelugu-revanthReddy

హైద‌రాబాద్ : ఆరోగ్య సంరక్షణకు సంబంధించి నాణ్యత విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలవాలని అన్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అత్యుత్తమ వైద్యుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాల‌ని పిలుపునిచ్చారు. వైద్యులు నిరంతరం నేర్చుకుంటూ, సేవలు అందిస్తూ ఎదుగుతూ ఉండాలని అన్నారు. చాలామందికి వైద్యులుగా మారే అర్హత సాధించలేరని అన్నారు. కానీ సమాజంలో మీరు ప్రత్యేకమైన గ్రూపు అని పేర్కొన్నారు. మీ సంరక్షణలో ఉన్నప్పుడు మా ప్రాణాలకు ఎలాంటి ఢోకా లేదని మీపై నమ్మకం పెట్టుకుంటాం అని చెప్పారు ముఖ్య‌మంత్రి.

లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్, వాటి అనుబంధ రంగాల్లో హైదరాబాద్‌ ఒక హబ్‌గా శరవేగంగా ఎదుగుతోందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. ఇంతటి గొప్ప సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సదస్సులో పాల్గొన్న నిపుణులైన వైద్యులు, కార్డియాలజిస్టులు నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి ఇక్కడికి రావడం అభినందనీయం అని ప్ర‌శంసించారు రేవంత్ రెడ్డి. నిరంతర అభ్యాసం, కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపిన రోజు మీరు మీ వృత్తికి ముగింపు పలికినట్టేన‌ని చెప్పారు. విజ్ఞానం, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ప్రపంచాన్ని శరవేగంగా మారుస్తున్నాయని అన్నారు. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు (AI) వంటి సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ అత్యంత హైటెక్ రంగంగా మారిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మీరంతా ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిలా అప్‌డేట్‌గా ఉండాలని కోరారు.

Exit mobile version