13 న‌వోద‌య విద్యాల‌యాలు, 2 ఎయిమ్స్ లు ఏర్పాటు చేయాలి

నిర్మలా సీతారామన్‌కు ఎంపీ లింగమనేని రమేశ్ విన్న‌పం

hellotelugu-LingamaneniRaamesh

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్‌ సహాయం అందించాలని జ‌న‌సేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏపీలో ప్రస్తుతం 28 జిల్లాలు ఉండగా 15 జిల్లాల్లో మాత్రమే జవహర్ నవోదయ విద్యాలయాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు. దీంతో 13 జిల్లాలు నవోదయ విద్యాలయాలు లేకుండా ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నవోదయ విద్యాలయాలను విస్తరించడం ద్వారా నాణ్యమైన విద్యకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని ఎంపీ పేర్కొన్నారు. అనుభవాత్మక విద్య, డిజిటల్ విద్య, మోడల్ పాఠశాలల అభివృద్ధి వంటి అంశాలకు కూడా ఈ విస్తరణ తోడ్పడుతుందని తెలిపారు. 2024 డిసెంబర్‌లో కేంద్ర మంత్రివర్గం ఐదేళ్ల కాలానికి ₹2,359.82 కోట్ల అంచనా వ్యయంతో దేశ వ్యాప్తంగా 28 కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని లింగమనేని రమేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదే ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు ఐదేళ్ల కాలంలో సుమారు ₹1,096 కోట్ల మేర నిధుల అవసరం ఉంటుందన్నారు.

నవోదయ విద్యాలయాలు లేని మొత్తం 13 జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయ ఆమోదంతో పాటు తగిన బహువార్షిక బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఎంపీ కోరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ఎంపీ తన వినతిపత్రంలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్ర‌కారం మ‌రో రెండు ఎయిమ్స్ లు ఏర్పాటు చేయాల్సి ఉంద‌న్నారు. తద్వారా అత్యున్నత వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం, వైద్య విద్య, పరిశోధన రంగాలు మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందని ఎంపీ తెలిపారు. అధునాతన వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధికి ఇది దోహద పడుతుందని పేర్కొన్నారు.

రెండు ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి ముందుగా సాధ్యా సాధ్యాల అధ్యయనం, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం ప్రారంభ బడ్జెట్ కేటాయింపులు చేయాలని, అనంతరం సంస్థ ఏర్పాటుకు అవసరమైన మూలధన నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు.

Exit mobile version