హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతుల గోదాములకు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో రైతులకు శాస్త్రీయ గోదాముల సౌకర్యాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రెండేళ్లలో ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి అదనంగా మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలంటే వడ్డీ భారాన్ని తగ్గించుకుంటూ ఆదాయ వనరులను పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది.తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్, హాకా కార్పొరేషన్‌ల మేనేజింగ్ డైరెక్టర్లతో మంత్రి తుమ్మల సమీక్ష చేపట్టారు. ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితి, గోదాముల వినియోగం, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు, ఆదాయ వృద్ధి అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఆధీనంలో 52 స్వంత గోదాములు ఉండగా వాటి మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులని తెలిపారు. ప్రస్తుతం ఈ గోదాముల్లో 104 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదై 6.33 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఈజీ, ఇన్వెస్టర్ గోదాములు, అద్దె గోదాములతో కలిపి మొత్తం 524 గోదాములను ప్రస్తుతం వినియోగిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా గోదాముల సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని , ప్రస్తుతం 48 కొత్త గోదాముల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోందన్నారు.
మొదటి దశలో నిర్మిస్తున్న 17 గోదాములను 2027 జనవరి నాటికి పూర్తి చేసి సుమారు 2.12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. రెండో దశలో 31 గోదాములను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి మరో 3.66 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని కల్పించనున్నట్లు వివరించారు. అదనంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 32 గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, వీటి ద్వారా మరో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కల్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.
















