అమరావతి : మానవ వనరులే దేశానికి అత్యంత విలువైన సంపద అని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా చెప్పేది ఏమిటంటే దాల్మియా నాయకత్వంలోని ఒక అంశంతో ప్రత్యేక అనుబంధం ఉంది. మీరు భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకదానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ… విద్యాభివృద్ధికి, విద్యా సంస్థల నిర్మాణానికి నిరంతరం అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. అశోక విశ్వ విద్యాలయంతో మీ అనుబంధం… భారతదేశానికి అత్యంత విలువైన సంపద సిమెంట్, ఉక్కు కాదు, మానవ వనరులేనని మీరు విశ్వసిస్తున్నారనే విషయాన్ని ప్రతిబింబిస్తోంది. అదే తత్వాన్ని మేం కూడా బలంగా విశ్వసిస్తున్నాం అని చెప్పారు నారా లోకేష్. ప్రభుత్వాలు ప్రతిభను తీర్చిదిద్దుతాయి. పరిశ్రమలు అవకాశాలను సృష్టిస్తాయి. రెండూ కలిసి భవిష్యత్తును నిర్మిస్తాయన్నారు.
దాల్మియా భారత్ అనేక ఏళ్లుగా ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో భాగస్వామిగా ఉందన్నారు లోకేష్. ఈ రోజు జరుగుతున్న విస్తరణ మన భాగస్వామ్యానికి ఆరంభం కాదు.. ఇది పరస్పర విశ్వాసంతో కొనసాగుతున్న బంధానికి తదుపరి అధ్యాయం. రూ.3,100 కోట్ల ఈ విస్తరణ… ఏపీ పట్ల దాల్మియా భారత్‌కు ఉన్న దీర్ఘకాలిక నిబద్ధతకు నిదర్శనం. అలాగే ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. సస్టైనబులిటీ, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, రెస్పాన్సిబుల్ గ్రోత్.. ఇవన్నీ మేం ఎంతో విలువైనవిగా భావించే సూత్రాలు అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు నిర్ణయాల్లో వేగం, విధానాల్లో స్థిరత్వం, పాలనలో సేవాభావాన్ని కోరుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఏపీ ఈ మూడు సూత్రాల ఆధారంగా పెట్టుబడులకు అనుకూలమైన పటిష్టమైన వ్యవస్థను నిర్మిస్తోంది. అందుకే ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను విస్తరిస్తున్నారు. కొత్త పెట్టుబడిదారులు కూడా ఏపీని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని తెలిపారు లోకేష్.

















