తిరుమల : శ్రీవారి వైద్యసేవలో భాగంగా ప్రారంభించిన గోసేవ కార్యక్రమానికి కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ విషయాన్ని వెల్లడించారు టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ . ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌ల సేవా స్లాట్లు పూర్తిగా భర్తీ కావడం ఈ కార్యక్రమానికి లభిస్తున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. వారం రోజుల పాటు సేవలందించిన డా. నరేంద్రరెడ్డి, అనంతరం సేవలందించిన డా. జి. పద్మనాభన్ తదితరులు ఈ సేవ తమ జీవితంలో మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని అన్నారు. శ్రీవారికి సేవ చేసే అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పినట్లు జేఈవో తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మూడో బ్యాచ్ గో వైద్య సేవలు కొనసాగుతున్నాయని ఈ సందర్బంగా వెల్లడించారు జేఈవో. శ్రీవారి వైద్యసేవలో భాగంగా ఎస్వీ గో సంరక్షణశాలలో గోవులకు నిపుణులైన పశు వైద్యులు సేవలందిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు పలు బ్యాచ్ లు ఇందులో పాల్గొన్నాయని చెప్పారు. తొలి బ్యాచ్ గత జూన్ 22 నుంచి 28 వరకు , రెండో బ్యాచ్ 29 న ప్రారంభమై ఈనెల జూలై 5వ తేదీ వరకు కొనసాగిందన్నారు. ప్రస్తుతం జూలై 6వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమైందని ఈ బ్యాచ్ 12వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు జేఈవో.
ప్రస్తుతం మూడో బ్యాచ్‌లో డా. జి. పద్మనాభన్ (అసిస్టెంట్ డైరెక్టర్, సింగనమల, అనంతపురం జిల్లా), రిటైర్డ్ ప్రొఫెసర్ డా. శ్యాంసుందర్ (ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయం, తిరుపతి), అమెరికా ఫ్లోరిడాలో స్థిరపడిన డా. చక్రవర్తి రెడ్డి తదితర నిపుణులు సేవలందిస్తున్నారని చెప్పారు. .


















