తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే ఆణివార ఆస్తానం ఈ ఏడాది జూలై 17న నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఈవో రవిచంద్ర వెల్లడించారు అధికారికంగా. ఆలయంలో అత్యంత వైభవోపేతంగా ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లలో సిబ్బంది మునిగి పోయారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈవో.
మరో వైపు వేసవి సెలవులు ముగిసినా ఏ మాత్రం భక్తుల రద్దీ తిరుమలకు తగ్గడం లేదు. దీంతో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 17న ఆణివార ఆస్థానం, 14న చేపట్టే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఇందులో భాగంగా ఆ రెండు రోజులలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇప్పటికే ఎవరైనా శ్రీవారి భక్తులు ముందుగా ప్రయాణం ప్లాన్ చేసుకుంటే రద్దు చేసుకోవాలని ముందస్తుగా సూచించారు ఈవో.
ఈ కారణంగా ఈ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు రద్దు చేసినట్లు తెలిపారు. జూలై 13, 16వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని గుర్తించాలని పేర్కొన్నారు . అదేవిధంగా జూలై 17న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు.



















