హైదరాబాద్ : తాగునీటిని సంరక్షించేందుకు, శుద్ధి చేసిన నీటిని తిరిగి ఉపయోగించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చేపట్టిన ‘డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్’ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్మాణ రంగానికి కూడా విస్తరించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా తృతీయ దశలో శుద్ధి చేసిన నీటిని నిర్మాణ పనుల కోసం ఉపయోగించే కార్యక్రమాన్ని కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ‘వాసవి ఆనంద్ నిలయం’ నిర్మాణ స్థలంలో ఈ ‘గ్రీన్ వాటర్ ట్యాంకర్ల’ను ప్రారంభించారు. ఈ చొరవలో భాగంగా శుద్ధి చేసిన నీటిని ఉపయోగించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన మొదటి నిర్మాణ సంస్థ ‘వాసవి గ్రూప్’ కావడం విశేషం.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాబోయే వేసవిలో నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉన్నందున నిర్మాణ పనుల్లో తాగునీరు లేదా భూగర్భ జలాలకు బదులుగా, తృతీయ దశలో శుద్ధి చేసిన నీటినే వాడాలని సూచించారు. నిర్మాణ సంస్థలన్నీ ఈ నిబంధనలను పాటించేలా చూడాలని ఆయన టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ముందుకొచ్చిన వాసవి గ్రూప్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు మల్కాజిగిరి ప్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ్ మాట్లాడుతూ నిర్మాణ స్థలాల్లో కాంక్రీట్ క్యూరింగ్ , దుమ్మును అదుపు చేయడం, శుభ్రపరిచే పనుల కోసం మాత్రమే ఈ శుద్ధి చేసిన నీటిని ఉపయోగించాలని తెలిపారు. ఈ నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఎంఎంసీకి చెందిన ఏసీపీలు, బోర్డుకు చెందిన డీజీఎంలతో కూడిన ఉమ్మడి బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎంఎంసీ పరిధిలోని సరూర్‌నగర్ (2.50 MLD), పటేల్ చెరువు (2.50 MLD), సఫిల్‌గూడ (0.60 MLD) STPల ద్వారా రోజుకు మొత్తం 5.60 MLD (5.6 మిలియన్ లీటర్ల) తృతీయ దశలో శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉందని తెలిపారు. బోర్డు ఈ నీటిని ఉచితంగా సరఫరా చేస్తుందని, వినియోగదారులు కేవలం రవాణా ఖర్చులు మాత్రమే భరించాల్సి ఉంటుందని తెలిపారు. నిర్మాణ సంస్థలు తమ సొంత ట్యాంకర్లను గ్రీన్ వాటర్ ట్యాంకర్లుగా నమోదు చేసుకోవచ్చని లేదా డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్ ద్వారా ట్యాంకర్లను బుక్ చేసుకోవచ్చని వారు చెప్పారు. వివరాల కోసం 155313 నంబర్‌కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.

















