చెన్నై : ఐపీఎల్ 19వ సీజన్ లో అరుదైన రికార్డు నమోదు చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఉర్విల్ పటేల్. తను మైదానంలోకి వచ్చీ రావడంతోనే శివాలెత్తాడు. ప్రత్యర్థి జట్టు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు చెందిన బౌలర్లకు చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరేలా షాట్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు. తను మైదానంలో ఉన్న కొద్ది సేపు ఒక ఉపద్రవం వచ్చిందా అన్న అనుమానం తెప్పించేలా ఆడాడు. వరుస సిక్సర్లతో విరుచుకు పడుతుంటే మైదానంలో ప్లేయర్లు చూస్తూ ఉండి పోయారు.
తను కేవలం 13 బంతుల్లో అర్ద శతకం పూర్తి చేశాడు. గతంలో ఇదే రికార్డు రాజస్తాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరు మీద ఉండేది. దానిని సమం చేశాడు ఉర్విల్ పటేల్. ఇక మొత్తం 23 పరుగులు ఎదుర్కొని 2 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ సునాయసంగా విజయం నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ రేసు పై ఆశలను సజీవంగా ఉంచుకునేలా చేసింది. సీఎస్కే ఇంకా మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించింది. ఆఖరులో శివమ్ దూబే విక్టరీకి చేరువ చేశాడు. జట్టు 19.2 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తి చేసింది. జయ కేతనం ఎగుర వేసింది. అంతకు ముందు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 28 బంతులు ఆడి 3 ఫోర్లు 2 సిక్సర్లతో 48 రన్స్ చేశాడు.
