హైదరాబాద్ : హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించబడిన ఉప్పల్ నల్ల చెరువు ఇప్పుడు నీటితో కళకళలాడుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఈ చెరువు వరద నీటితో నిండి పోయింది. భారీగా పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో మురికి కూపంగా మారిన ఈ చెరువును హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఈ నేపథ్యంలో వర్షం పడినప్పుడు వరద నీరు చెరువులోకి చేరేలా, అలాగే స్వల్పంగా వచ్చే మురికి నీరు ప్రత్యేక కాలువ ద్వారా బయటకు వెళ్లేలా కాలువలను అభివృద్ధి చేసింది. దీని ఫలితంగా ఎగువ ప్రాంతాలు ముంపునకు గురికాకుండానే వరద నీరు నల్ల చెరువుకు చేరుకుంది. ఉప్పల్ నల్ల చెరువులో సుమారు 10 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలను తొలగించి, దాని విస్తీర్ణాన్ని 70 ఎకరాలకు పెంచిన విషయం విదితమే. సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో ఈ చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది.
ఇన్లెట్లు (నీరు వచ్చే మార్గాలు) అవుట్‌లెట్ల (నీరు బయటకు వెళ్లే మార్గాలు) అభివృద్ధికి ప్రయత్నం చేసింది. ఎగువన ఉన్న నాచారం చెరువు , చుట్టుపక్కల ప్రాంతాల నుండి వరద నీరు చెరువులోకి వచ్చేలా హైడ్రా రెండు ఇన్లెట్లను అభివృద్ధి చేసింది. చెరువు నిండిన తర్వాత వరద నీరు సురక్షితంగా మూసీ నదికి చేరేలా అవుట్‌లెట్‌ను కూడా మెరుగు పరిచింది. కేవలం నీటి నిల్వకే పరిమితం కాకుండా, ప్రజలకు వినోదం, ఆరోగ్యం , విశ్రాంతిని అందించేలా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన ప్రధాన కట్ట , పిల్లల కోసం ఆట స్థలం , ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉప్పల్ నల్ల చెరువు కుటుంబాలు ప్రశాంతంగా గడపగలిగే ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంగా రూపు దిద్దుకుంటోంది. తన ప్రారంభ దశల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమైన చెరువులలో ఉప్పల్ నల్ల చెరువు ఒకటి. ఇప్పటికే మూడు చెరువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. అదే తరహాలో ఉప్పల్ నల్ల చెరువు కూడా త్వరలో నగరానికి మరో అందమైన జలవనరుగా మారనుంది.
