ఆదిత్య బీజీ -2 కొత్త విత్త‌నాల ఆవిష్క‌ర‌ణ

hellotelugu-CottonSeeds

అమ‌రావ‌తి : ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాల‌యం శాస్త్ర‌వేత్త‌లు రైతుల‌కు మేలు చేకూర్చేందుకు ఆదిత్య బీజీ -2 పేరుతో ప‌త్తి విత్త‌నాల‌ను త‌యారు చేశారు. ఈ విత్త‌నాల‌ను మంత్రి అచ్చెన్నాయుడు విడుద‌ల చేశారు. ఇది సూటి రకం (వేరైటీ) కావడంతో రైతులు ప్రతి సంవత్సరం కొత్త విత్తనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, తమ పొలాల్లో పండించిన పంట నుంచి విత్తనాన్ని భద్రపరచుకొని తిరిగి వినియోగించు కోవచ్చని తెలిపారు. దీంతో విత్తనాలపై అయ్యే పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు.

ఈ రకం శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు వంటి కాయ తొలిచే పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుందని తెలిపారు. అదేవిధంగా పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక వంటి రసం పీల్చే పురుగుల ప్రభావాన్ని కూడా తగ్గించే లక్షణాలు కలిగి ఉందన్నారు. బ్యాక్టీరియల్ బ్లైట్, సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, వెర్రి తెగులు వంటి ప్రధాన వ్యాధులను తట్టుకునే సామర్థ్యం ఉండటంతో రైతులు పురుగు మందులు, తెగుళ్ల నివారణ మందులపై చేసే ఖర్చును తగ్గించు కోవచ్చన్నారు.

ఈ రకం సాధారణ సిఫారసు చేసిన దూరం కంటే సాంద్రతతో సాగు చేసినప్పుడు మరింత అధిక దిగుబడులు సాధ్యమవుతున్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తల బృందాన్ని మంత్రి అచ్చెన్నాయుడు, ఆంగ్రూ ఉపకులపతి డా. పి.వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డా. యడ్లపల్లి సతీష్, పరిశోధనల సంచాలకురాలు డా. వి. సుమతి, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. ఎన్.వి.వి.ఎస్. దుర్గాప్రసాద్, ప్రధాన పత్తి శాస్త్రవేత్తలు డా. రాఖమణి, డా. ఎన్. చాముండేశ్వరి, డా. చాపర రాజు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version