Online Gaming : ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) అక్టోబర్ 2న ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ (PROG) చట్టం 2025 కింద ముసాయిదా నియమాలను విడుదల చేసింది. ఈ నియమాలపై ప్రజల అభిప్రాయాలను అక్టోబర్ 31 వరకు ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయడంలో ఇది మరో కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు.
Online Gaming – ముసాయిదా నియమాల ముఖ్యాంశాలు:
ముసాయిదా ప్రకారం, ఆన్‌లైన్ గేమింగ్ (Online Gaming) అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఈ సంస్థ ఆన్‌లైన్ గేమ్‌లను గుర్తించడం, నమోదు చేయడం, వర్గీకరించడం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటి పనులను పర్యవేక్షిస్తుంది. అలాగే నియంత్రణ, అమలు చర్యలను కూడా ఇది పర్యవేక్షిస్తుంది.
కఠినమైన శిక్షలు:
చట్టవిరుద్ధంగా ఆన్‌లైన్ మనీ గేమ్స్ నిర్వహిస్తే గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా విధించవచ్చు. పదేపదే నేరాలు జరిగితే మరింత కఠినమైన శిక్షలు, అధిక కాలం జైలు శిక్షలు, అధిక మొత్తంలో జరిమానాలు ఉంటాయి. అంతేకాదు, నిషేధిత ఆటలకు సంబంధించిన ప్రకటనలు, నిధుల బదిలీలు కూడా పూర్తిగా నిషేధించారు.
సురక్షిత విభాగాలకు ప్రోత్సాహం:
ఈ చట్టం, దానికి అనుసంధానమైన నియమాలు ఇ-స్పోర్ట్స్, విద్యా సంబంధిత ఆటలు, సామాజిక ఆటల వంటి సురక్షిత విభాగాల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తాయి. అదే సమయంలో వినియోగదారులు, ముఖ్యంగా యువత, దుర్బల వర్గాలు జూదం తరహా డబ్బు గేమింగ్ ప్రమాదాల నుండి రక్షణ పొందేలా చర్యలు తీసుకుంటాయి.
ప్రజాభిప్రాయం ఆహ్వానం:
ఈ ముసాయిదా నియమాలపై ప్రజలు తమ అభిప్రాయాలను అక్టోబర్ 31 లోపు ogrules.consultation@meity.gov.in
కు ఈమెయిల్ ద్వారా పంపవచ్చు.
Also Read : Google Huge Layoffs : ఏఐ కారణంగా ‘గూగుల్’ భారీగా ఉద్యోగుల కోత
