అమరావతి : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పొందూరు ఖాదీకి అంతర్జాతీయ పరంగా గుర్తింపు దక్కడం పట్ల స్పందించారు. ఈ మేరకు అధికారికంగా జీఐ (Geographical Indication) ట్యాగ్ లభించింది. ఈ సందర్బంగా చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ చారిత్రక గుర్తింపు పొందూరు ఖాదీకి ప్రత్యేక గుర్తింపు దక్కడం వల్ల దీనిపై ఆధారపడిన వారికి మెరుగైన అవకాశాలు దక్కుతాయని అన్నారు. దాని ప్రత్యేక గుర్తింపును కాపాడుతూ, స్థిరమైన అభివృద్ధికి దారి చూపేలా చేస్తుందన్నారు రామ్మోహన్ నాయుడు. మన చేనేత కార్మికులకు కొత్త అవకాశాలను కల్పించేలా చేస్తుందన్నారు .
తరతరాలుగా కష్టపడి, నిబద్ధతతో ఈ కళను కాపాడుతూ వచ్చిన చేనేత కార్మికులకు ఈ గౌరవం అంకితం ఇస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. వారి ఓర్పు, కళాత్మకతే శ్రీకాకుళాన్ని వారసత్వం, గర్వానికి ప్రతీకగా నిలిపాయని స్పష్టం చేశారు. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం, చేతి వృత్తులవారికి సాధికారత కల్పించడం, భారత సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో నిరంతర కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, పొందూరు ఖాదీ అభివృద్ధికి సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేసుకుంటానని అన్నారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. రాబోయే తరాలకు పొందూరు ఖాదీ గొప్పతనం తెలిసేలా ఈ చేనేత కళకు మద్దతు ఇవ్వాలని, దీనిని పదిలంగా పది కాలాల పాటు రాబోయే తరాలకు స్పూర్తిగా ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు.
