న్యూఢిల్లీ : కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది శనివారం. ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద రెండు లక్షలకు పైగా సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రుణాలు మంజూరు చేసే మైలురాయిని అధిగమించినట్లు తెలిపింది. 2 లక్షల రుణాల మంజూరు మైలురాయిని దాటడంతో పాటు, ఈ పథకం ద్వారా రూ. 20,300 కోట్లకు పైగా ప్రాజెక్ట్ పెట్టుబడులు సమకూరాయని ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు.
ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. లబ్ధిదారులలో దాదాపు 90 శాతం మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు , 44 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే పీఎంఎఫ్ఎంఈ మద్దతు పొందిన 75,000కు పైగా సంస్థలు ఉద్యమ్ ఆధార్, ఉద్యమ్ అసిస్ట్, ఎఫ్ఎస్ఎస్ఏఐ , జీఎస్టీ వంటి నమోదుల ద్వారా అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యాయని చెప్పారు.
ఈ పథకం దాదాపు 11 లక్షల ప్రత్యక్ష , పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని ఆయన వెల్లడించారు. రెండు లక్షల మంది లబ్ధిదారులను చేరడం అనేది ఈ దార్శనికత దేశవ్యాప్తంగా స్పష్టమైన ఫలితాలను ఇస్తోందని నిరూపిస్తుందని పాశ్వాన్ అన్నారు. మొత్తం లబ్ధిదారులలో దాదాపు 44 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఉండటం ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం)లో కీలకమైన ‘మహిళా నేతృత్వంలోని అభివృద్ధి’ స్ఫూర్తికి నిదర్శనమని అభివర్ణించారు.
ఈ పథకం కింద అందించే ‘సీడ్ క్యాపిటల్’ (ప్రారంభ పెట్టుబడి) మద్దతు గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. దీని ద్వారా 4.18 లక్షల మందికి పైగా స్వయం సహాయక సంఘం సభ్యులకు మద్దతు లభించిందన్నారు. అలాగే, 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 80 ‘కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ల’ ఏర్పాటుకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపగా, వాటిలో 32 కేంద్రాలు ఇప్పటికే కార్యరూపం దాల్చాయని తెలిపారు.

















