హైదరాబాద్ : విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడి శాశ్వత అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన ఉద్యోగి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సహకారంతో కొండంత అండగా నిలిచింది. ఉచిత ప్రమాద బీమా పథకంలో భాగంగా బాధిత డ్రైవర్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది.కరీంనగర్ జిల్లా కోరుట్ల డిపో లో డ్రైవర్ గా పనిచేసే ఎండీ.మదార్ (E.323013) గత ఏడాది అక్టోబర్ 9వ తేదీ విధి నిర్వహణలో ప్రమాద బారిన పడి కాలు కోల్పోయారు. ఇంటికి పెద్ద దిక్కు శాశ్వత అంగవైకల్యం బారిన పడడంతో బాధిత డ్రైవర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ క్లిష్ట సమయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ‘సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్’ బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచింది. సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులందరూ యూబీఐ బ్రాంచీలలో ఖాతాలు తెరిచి రూపే కార్డులు పొంది ఉండటంతో, ఈ ఖాతా ద్వారా లభించే ఉచిత ప్రమాద బీమా వర్తించింది. హైదరాబాద్ బస్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వై. నాగిరెడ్డి, యూబీఐ సిజిఎం ఎం. రవీంద్రబాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్. సత్యనారాయణ బాబ్జిలతో కలిసి రూ. 50 లక్షల విలువైన చెక్కును బాధిత డ్రైవర్ మదార్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ తమ తప్పు లేకపోయినా రోడ్డు ప్రమాదాల బారిన పడి ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురికావడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీజీఎస్ ఆర్టీసీ నిరంతరం ఉద్యోగుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని, ఆపదలో ఉన్న కుటుంబాలకు సంస్థ ఎల్లప్పుడూ ధైర్యంగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇటువంటి బీమా పథకాలు అత్యవసర సమయాల్లో కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక భద్రతను ఇస్తాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాద బీమా పథకం ద్వారా 27 మంది ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందన్నారు. సంస్థ ఉద్యోగులకు విశేష సేవలందిస్తున్న యూనియన్ బ్యాంక్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
