లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న, ఆందోళనలకు దారితీసిన సర్ ప్రక్రియపై స్పందించారు. దానిని ఆయన సమర్థించారు. భారతదేశ భద్రత, ఐక్యతకు అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం అత్యవసరం అని అన్నారు. సర్ ప్రక్రియ సరైనదేనని పేర్కొన్నారు. ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు బేషరతుగా మద్దతు తెలిపారు. మరో వైపు ఓట్ల చోరీ జరుగుతోందని ఇప్పటికే 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించారని, దీని వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలతో పాటు అమిత్ షా, మోదీ ప్రమేయం ఉందని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, ఎంపీ రాహుల్ గాంధీ, నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం యోగి ఆదిత్యానాథ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇటీవల 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. అనాదిగా భారతదేశం ప్రజాస్వామ్య విలువలకు సంరక్షకురాలిగా ఉంది. భారత ఎన్నికల సంఘం నిర్వహించే ప్రత్యేక విస్తృత పునర్విమర్శ దాని ప్రజాస్వామ్య వారసత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక కీలకమైన ప్రయత్నం. మరణించిన, శాశ్వతంగా వేరే చోటికి వెళ్లిన , నకిలీ నమోదులను క్రమపద్ధతిలో ధృవీకరించడం చాలా అవసరం అని పేర్కొన్నారు సీఎం యోగి . నియమాల ప్రకారం ఓటర్ల జాబితాలో చట్టవిరుద్ధంగా నమోదు చేయబడిన అనర్హులైన పేర్లను గుర్తించి, తొలగించడం భారతదేశ భద్రత, ఐక్యత ,సమగ్రతకు అత్యంత అవసరమన్నారు. ఈ విషయాన్ని నెగటివ్ గా కాకుండా పాజిటివ్ తో ఆలోచించాలని సూచించారు.
