అమరావతి : నగర వన్ యోజన ప్రాయోజిత పథకం కింద పెనుకొండ పట్టణంలో రెండు ఎకో పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. వీరన్న కొండపై రూ.2 కోట్లతో శ్రీకృష్ణ దేవరాయ ఫోర్ట్ ఎకో పార్క్, పట్టణంలోని బెంగుళూరు-హైదరాబాద్ హై వే పక్కన మరో రూ.2 కోట్లతో పెనుకొండ ఎకో పార్క్ ను నిర్మిస్తున్నామన్నారు. ఈ ఎకో పార్క్ లో చిన్న పిల్లల ఆటస్థలం, పచ్చిక బయలుతో కూడిన ల్యాండ్ స్కిప్పింగ్, ఓపెన్ జిమ్, స్విమ్మింగ్ ఫూల్, చిట్టడవిని తలపించేలా మియావాకి ప్లాంటేషన్, రెస్టారెంట్, ట్రెక్కింగ్ పాత్ నిర్మించనున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ ఎకో పార్క్ లో ఆట స్థలం, రెస్టారెంట్, సందర్శకులు బస చేసేలా కాటేజీలు, సన్ రైజ్, సన్ సెట్ ప్యూపాయింట్లు, కొండపైనున్న బైరావని కుంటకు రహదారి ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పిస్లామని మంత్రి సవిత తెలిపారు.
పర్యాటక అభివృద్ధిలో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ లో త్వరలో బోటింగ్ ప్రారంభించనున్నామని మంత్రి సవిత వెల్లడించారు. రిజర్వాయర్ లో రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరందించిన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కుంభకర్ణ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నామని, ఇందుకు సంబంధించిన డీపీఆర్ లు సైతం రూపొందించి, ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. రిజర్వాయర్ లో బోటింగ్ ప్రారంభించడం ద్వారా పట్టణానికి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు ఎస్. సవిత. పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం కూడా రానుందని, పలువురికి ఉపాధి సైతం లభించనుందని మంత్రి తెలిపారు.
















